పోతిరెడ్డిపాడుపై కేసీఆర్ పొలిటికల్ స్టాండ్

Spread the love

విపక్షాల ముప్పేట దాడితో ఆత్మరక్షణలో అధికార పక్షం
కృష్ణా బేసిన్ ప్రజల్లోనూ సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం
తప్పనిసరి పరిస్థితుల్లో ఏపీ సర్కారు తీరుపై కాసింత నిరసన గళం

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ డిశ్చార్జిని డబుల్ చేయడంతో పాటు శ్రీశైలంపై మూడు టీఎంసీల కెపాసిటీతో మరో లిఫ్ట్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయడం తెలంగాణలో రాజకీయ దుమారమే సృష్టిస్తోంది. అన్ని రాజకీయ పక్షాలు ముక్త కంఠంతో ఏపీ తీరును తప్పు బడుతున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్ కబ్జా చేస్తున్నట్టు ఏపీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నా దానిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇన్నాళ్లు నోరు విప్పలేదు. రాష్ట్రంలో రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అప్పటి ఏపీ ప్రతిపక్ష నేత జగన్తో కేసీఆర్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ జగన్కు రకరకాల మార్గాల్లో సాయం చేసినట్టుగా చెప్తుంటారు. జగన్ ప్రమాణ స్వీకారానికి అతిథిగా హాజరైన కేసీఆర్ గోదావరి నీటితో రెండు రాష్ట్రాలను సుసంపన్నం చేసుకుందామని ప్రతిపాదించారు. కేసీఆర్తో కలిసి సాగేందుకు జగన్ అదే వేదికపై నుంచి స్నేహహస్తాన్ని అందించారు. అది వరకు ఇద్దరు వ్యక్తులు, ఇరు పార్టీల అధినేతల మధ్య ఉన్న స్నేహం కాస్త ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మైత్రిగా మొగ్గ తొడిగింది.
పుష్కలంగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తోన్న గోదావరిని కొంతలో కొంతన్న వినియోగించుకుందామన్న కేసీఆర్ ప్రతిపాదనపై ఏపీ సీఎం జగన్, ఆ రాష్ట్ర ఉన్నతాధికారులతో కూడిన బృందం పలుమార్లు చర్చలు జరిపింది. తెలంగాణ భూభాగం నుంచి గోదావరిని మళ్లించి నాగార్జునసాగర్, శ్రీశైలం మీదుగా రాయలసీమకు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తాగు, సాగునీటిని ఇస్తామని కేసీఆర్ పెద్ద మనిషి తరహాలో ప్రతిపాదించారు. ఈ ప్రపోజల్పై రెండు రాష్ట్రాల ఇరిగేషన్ ఇంజనీర్లు సమావేశమై ఐదారు అలైన్మెంట్లపై చర్చలు జరిపారు. వాటిలో రెండు అలైన్మెంట్లను ఫైనల్ చేసి గోదావరి ‌‌ – కృష్ణా నదులు అనుసంధానం చేయాలని అనుకున్నారు. కానీ ఎందుకో ఆ ప్రతిపాదన ముందట పడలేదు. ఒకానొక దశలో ఏపీ సొంతంగానే గోదావరి – కృష్ణా లింక్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రపోజల్స్ రెడీ చేసింది. కారణాలేమైనా అది కూడా కార్యరూపం దాల్చలేదు.
కేవలం హైడల్ పవర్ ప్రాజెక్టుగా ఆరంభించిన శ్రీశైలంను క్రమేణ ఇరిగేషన్ ప్రాజెక్టుగా మార్చారు. కృష్ణా ఉపనది తుంగభద్ర పరివాహకంలోని కర్నూల్ జిల్లా కృష్ణా బేసిన్లో ఉంది. కర్నూల్కు తాగు, సాగునీరు ఇవ్వాలంటూ శ్రీశైలం నీటి వినియోగానికి తెరతీశారు. మద్రాస్కు తాగునీరు పేరుతో తెలుగు గంగా కెనాల్ తవ్వి పోతిరెడ్డిపాడు వద్ద తూములు ఏర్పాటు చేశారు. 11 వేల క్యూసెక్కుల డిశ్చార్జి కెపాసిటీతో మొదలైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను వైఎస్ రాజశేఖర్ రెడ్డి 44 వేల క్యూసెక్కులకు పెంచారు. అప్పుడు ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్ వైఎస్ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు.
తెలంగాణ సాధన ఉద్యమానికి అందరినీ ఏకం చేసిన ‘‘నీళ్లు – నిధులు – నియామకాలు” నినాదం చిరకాలం నిలిచిపోతుంది. ఇక్కడ నీళ్లు అంటే గోదావరి నీళ్లు ఎంతమాత్రమూ కాదు. గోదావరి నీళ్లలో తెలంగాణ ఎప్పుడూ దోపిడీని ఎదుర్కోలేదు. ప్రాజెక్టుల డిజైన్లో లోపాలున్నా అవి ఏపీ భూభాగానికి లాభం చేసివి కావు. నీళ్ల దోపిడీ అంటే కేవలం కృష్ణా నీళ్ల దోపిడీనే. కృష్ణా నీటిని సీమాంధ్ర పాలకులు తెలంగాణకు కాకుండా చేయడానికి చేసిన కుట్రలపై ఎంత చెప్పుకున్నా తక్కువే. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద తెలంగాణలో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు అందకుండా ఆంధ్ర ఇంజనీర్ కేఎల్ రావు చేసిన కుట్రలను కథలు కథలుగా చెప్తారు. అయినా మనోళ్లకు నీళ్ల దోపిడీపై అవగాహన తక్కువే. సాగర్ ప్రాజెక్టు సైట్, ఎడమ కాలువ తూము, కాలువ అలైన్మెంట్ ఇలా అన్నింటా ఆంధ్ర ఇంజనీర్లు తెలంగాణ గడ్డను దగా చేశారు. అసెంబ్లీ ముందస్తు ఎన్నికల ప్రచారంలో పాలమూరు జిల్లాలో నిర్వహించిన ప్రచార సభలో సీఎం కేసీఆర్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను రాజశేఖర్ రెడ్డి అనే దర్మార్గుడు మూడింతలు పెంచి తెలంగాణను ఎండ బెట్టాడని దుయ్యబట్టారు. సీమాంధ్ర నేతల జల దోపిడీకి పాలమూరు నేతలు హారతులు పట్టారంటూ వారిని బానిస బతుకులంటూ దునుమానాడారు.
పోతిరెడ్డిపాడు కెపాసిటీని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రిజర్వాయర్లో 800 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు కూడా నీళ్లు తీసుకునేలా ఇంకో లిఫ్ట్ స్కీంను ప్రతిపాదించారు. ఈ లిఫ్ట్ ద్వారా రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఏర్పడుతుంది. అంటే ఒక్క రోజులో గ్రావిటీ ద్వారా7 టీఎంసీలు, కొత్త లిఫ్ట్ స్కీం ద్వారా 3 టీఎంసీలు నీటిని ఏపీ తీసుకోనుంది. ఇప్పటికే ఉన్న శ్రీశైలం రైట్ కెనాల్, హంద్రీనీవా, ముచ్చుమర్రి లిఫ్ట్ స్కీముల నుంచి ఏపీ తీసుకునే నీళ్లు వీటికి అధనం. పోతిరెడ్డిపాడు పాత తూములు, రాజశేఖర్రెడ్డి కొత్తగా 44 వేల క్యూసెక్కుల కెపాసిటీతో ఏర్పాటు చేసిన తూములు, ఎస్కేప్ గేట్ల ద్వారా రోజుకు ఆరు టీఎంసీల నీటిని తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు పెంచే 36 వేల క్యూసెక్కులతో ఇంకో మూడు టీఎంసీల నీళ్లు అందుబాటులోకి వస్తాయి. అంటే కేవలం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తూముల ద్వారానే 9 టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ నీటితో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని మొత్తం భూములను సాగులోకి తీసుకురావచ్చు. నిజానికి కర్నూల్ మినహా మిగతా రాయలసీమ జిల్లాలు పెన్నా బేసిన్ పరిధిలోనివి. ఒక నది బేసిన్లోని సాగు, తాగు నీటి అవసరాలు తీరాకే ఇంకో బేసిన్కు నీళ్లు ఇవ్వాల్సి ఉంటుంది. కృష్ణా బేసిన్లోని మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలను ఎండబెడుతూ బేసిన్ అవతలికి నీటిని తరలించడానికే ఏపీ ప్రాధాన్యమిస్తోంది.
‘‘బేసిన్ల గొడవలు లేవు.. భేషజాలు లేవు..” అంటూ గోదావరి ‌‌ – కృష్ణా అనుసంధానంపై కేసీఆర్వ్యాఖ్యానించారు. అంటే పెన్నా బేసిన్కు కృష్ణా నీళ్లను తరలించడానికి తనకూ ఎలాంటి అభ్యంతరమూ లేదని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ పేర్కొన్నారు. గోదావరి నీటిని కృష్ణా మీదుగా పారించి పెన్నా బేసిన్ వరకు తీసుకెళ్లి రాయలసీమను రతనాల సీమగా తీర్చుదిద్దుతానని కంచి దర్శనానికి వెళ్లొస్తూ నగరి ఎమ్మెల్యే రోజా ఇంటి ముందు కేసీఆర్ అక్కడి ప్రజలకు పెద్ద హామీనే ఇచ్చారు. నీటిని ఉపయోగించుకునే విషయంలో ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీతోనే జగన్ పోతిరెడ్డిపాడు విస్తరణపై ముందడుగు వేశారు. ఏపీ వాటర్ రీసోర్సెస్ మంత్రి అనిల్ ఇదే విషయాన్ని చెప్పారు. నీటి వినియోగం విషయంలో కేసీఆర్, జగన్ అన్నదమ్ముల్లా పనిచేస్తున్నారని అన్నారు.
ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు విస్తరణపై దూకుడుగా వ్యవహరిస్తుంటే తెలంగాణలో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు కేసీఆర్ మౌనవ్రతంపై పోరుదారి పట్టారు. ‘‘థూ.. నీ బతుకుచెడ”అని కేసీఆర్ చేత తిట్లు తిన్నవారు అలాంటి పరుష పదజాలమే ప్రయోగిస్తూ కేసీఆర్ను ప్రశ్నించడం మొదలు పెట్టారు. పోతిరెడ్డిపాడుపై ప్రత్యక్ష రాజకీయ కార్యచరణ మొదలయ్యింది. అలాగే వదిలేస్తే ప్రతిపక్షాలు ఇంకా రెచ్చిపోతాయని గ్రహించిన కేసీఆర్ పోతిరెడ్డిపాడుపై పొలిటికల్ స్టాండ్ తీసుకున్నారు. రాజకీయంగా ప్రతిపక్షాలను ఎదుర్కోవాలన్న ఒక ప్రయత్నం కేసీఆర్ వైపు నుంచి మొదలైంది. పాలకపక్షంగానూ దీనిపై స్పందించాలి కాబట్టి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) కు ఫిర్యాదు చేస్తామని, సుప్రీంలో అప్పీల్ చేస్తామని ప్రకటించారు.
నిజానికి పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను మన ప్రభుత్వ ప్రయత్నాలేవి ఆపజాలవు. పోతిరెడ్డిపాడు సహా ఏపీ విస్తరణ పనులు చేసే ప్రాంతమంతా ఆ రాష్ట్ర భూభాగంలోనే ఉంటుంది. అక్కడి పాలన, లా అండ్ ఆర్డర్ మొత్తం ఆ రాష్ట్రం చేతుల్లోనే ఉంటుంది. అంటే అక్కడి వరకు ఇప్పటికిప్పుడు ఏ వ్యవస్థలు ప్రవేశించి పనులను ఆపలేవు. కేఆర్ఎంబీకి కంప్లైంట్ చేస్తే ఆ బోర్డు లెటర్లు రాయడం మినహా ఇంకేమీ చేయలేదు. సుప్రీంలో కేసు ఇప్పట్లో తేలేది కాదు. ఆలోగా ఏపీ చేయాల్సిన పని చేసుకుపోతుంది. ఈ విషయం మిగతా రాజకీయ నాయకుల కన్నా కేసీఆర్కే ఎక్కువ తెలుసు. కానీ ప్రతిపక్షాల ముప్పేట దాడిని నిలువరించాలంటే ఓ కంప్లైంట్ చేయాలి.. కోట్లాది రూపాయల ప్రజల ధనాన్ని ఫేమస్ లాయర్ల చేతుల్లో పోసి సుప్రీంలో ఓ పిటిషన్ వేయాలి. ఇప్పటికింతే… ఈ ప్రయత్నాలతో ఏమీ కాదు.. జస్ట్ ప్రతిపక్షాల దాడిని టీఆర్ఎస్ దీటుగా తిప్పికొట్టగలదు అంతే.. పోతిరెడ్డిపాడు విస్తరణపై జగన్కు హింట్ ఇచ్చిన నాయకుడిగా కేసీఆర్ ఎప్పటికీ నిలిచిపోతారు. మరి తెలంగాణ సమాజం ఆయనను ఎలా చూస్తుంది అనేది ఇప్పటికిప్పుడే తేలేది కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *