దేశంలో కోవిడ్ విస్తృతికి 2 ప్రధాన కారణాలు: ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా

Spread the love

దేశంలో కోవిడ్ ఇన్‌ఫెక్షన్ వేగంగా వ్యాప్తి చెందడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా శనివారంనాడు తెలిపారు. కోవిడ్ జాగ్రత్తలను ప్రజలు నిర్లక్ష్యం చేయడం ఒక ప్రధాన కారణమని, వ్యాక్సినేష్ మొదలై, కేసులు తగ్గడంతో ప్రజలు ఈ తరహా ప్రవర్తనకు అలవాటు పడ్డారని అన్నారు.

ఇదే సమయంలో వైరస్ రూపాంతరం చెంది వేగంగా వ్యాపిస్తుండటం మరో కారణమని అన్నారు. కరోనా ఇన్‌ఫెక్షన్ విస్తరిస్తున్న సమయంలో మత సంబంధిత, రాజకీయ కార్యకలాపాలు జరుగుతుండటంపై కూడా గులేరియా ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాలను ఆంక్షలు తప్పనిసరిగా పాటిస్తూ జరుపుకోవాల్సి ఉంటుందన్నారు.

కోవిడ్ సమయంలో పాటించాల్సిన నిబంధనలను కూడా తప్పనిసరిగా పాటించాలి’ అని డాక్టర్ గులేరియా అన్నారు. ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న కుంభమేళాలో దేశవ్యాప్తంగా భక్తులు పాల్గొంటున్న నేపథ్యంలో ఎయిమ్స్ చీఫ్ సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

“అనేక మతపరమైన కార్యకలాపాలు, ఎన్నికలు జరుగుతున్న తరుణమిది. ప్రాణాలు కూడా చాలా విలువైనవనే విషయాన్ని మనం గుర్తెరగాలి. ఆంక్షలు పాటిస్తూ వీటిని జరుపుకోవాలి. అందువల్ల మతపరమైన మనోభావాలకు ఇబ్బంది కలగదు.

క్రమంగా వ్యాక్సినేషన్ వయోపరిమితిపై ఉన్న నిషేధాన్ని సడలిస్తూ వెళ్లాలనీ, ఇందువల్ల పవిత్ర స్నానాలు చేసే వాళ్లలో ఎక్కువ మంది వ్యాక్సినేషన్ వేయించుకున్న వారే ఉంటారని ఆయన అన్నారు. దేశంలో మరిన్ని వాక్సిన్లు కూడా వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయని, ఇందువవల్ల ఎక్కువ మంది జనాభాకు వ్యాక్సినేషన్ అందుబాటులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు.

కాగా, దేశంలో గత కొద్ది వారాలుగా కోవిడ్ ఇన్‌ఫెక్షన్ కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. ఒక్క శనివారంనాడే దేశంలో 2,34,692 కరోనా కేసులు నమోదు కాగా, 1,341 మరణాలు సంభవించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *