జింబాబ్వే కోచ్‌పై ఐసిసి 8 ఏళ్ల నిషేధం..!

Spread the love

జింబాబ్వే క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, కోచ్‌ హీత్‌ స్ట్రీక్‌పై ఐసిసి ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. అవినీతి నిరోధక నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు స్ట్రీక్‌పై ఈ నిర్ణయం తీసుకున్నామని ఐసిసి జనరల్‌ మేనేజర్‌ అలెక్స్‌ మార్షల్‌ ప్రకటించారు.

ఈ నిషేధ సమయంలో స్ట్రీక్‌ ఏ రకమైన క్రికెట్‌ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని పేర్కొన్నారు. 47 ఏళ్ల హీత్‌ స్ట్రీక్‌ జింబాబ్వే తరఫున 65 టెస్టులు, 189 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 216 వికెట్లు తీసిన అతను 1,990 పరుగులు చేశాడు. వన్డేల్లో 239 వికెట్లు, 2,943 పరుగులు సాధించాడు.

‘హీత్‌ స్ట్రీక్‌ ఎంతో అనుభవమున్న అంతర్జాతీయ మాజీ క్రికెటర్‌, జాతీయ జట్టు కోచ్‌. క్రికెట్‌లో అవినీతిని నిరోధించడం కోసం నిర్వహించిన ఎన్నో అవగాహన కార్యక్రమాల్లో అతను పాల్గొన్నాడు. ఈ నిబంధనల ప్రకారం ఎంత బాధ్యతగా మెలగాలో కూడా అతనికి అవగాహన ఉంది. కానీ అతను ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించాడు.

2018లో జరిగిన జింబాబ్వే, బంగ్లాదేశ్‌, శ్రీలంక ముక్కోణపు సిరీస్‌, జింబాబ్వే-అఫ్గానిస్తాన్‌ సిరీస్‌, ఐపిఎల్‌, అఫ్గానిస్తాన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మ్యాచ్‌లకు సంబంధించి అంతర్గత సమాచారాన్ని బుకీలకు చేరవేశాడు. ఆటగాళ్లను బుకీలకు పరిచయం చేసేందుకు ప్రయత్నించాడు. స్ట్రీక్‌ అంతర్గత సమాచారంతో ఆయా మ్యాచ్‌ల తుది ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపలేదు’ అని ఐసిసి ఒక ప్రకటనలో తెలిపింది. 2018 ఐపిఎల్‌లో స్ట్రీక్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా పనిచేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *