బెంగాల్ పోల్స్ ర‌క్త‌సిక్తం.. అయిదుగురు మృతి..

Spread the love

సితాల్‌కుచి‌: ప‌శ్చిమ బెంగాల్‌లో నాలుగ‌వ విడత పోలింగ్ ర‌క్త‌సిక్త‌మైంది. కూచ్ బెహ‌ర్ జిల్లాలో పోలింగ్ కేంద్రం వ‌ద్ద కాల్పుల ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. సితాల్‌కుచి నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ, తృణ‌మూల్ కాంగ్రెస్ వ‌ర్క‌ర్లు ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. ఆ స‌మ‌యంలో జ‌రిగిన కాల్పుల్లో అయిదుగురు చ‌నిపోయిన‌ట్లు తెలుస్తోంది.

ఈ ఘ‌ట‌న ప‌ట్ల ఎన్నిక‌ల సంఘం నివేదిక కోరింది. ఘ‌ర్ష‌ణ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న సీఆర్‌పీఎఫ్ ద‌ళాలు కూడా ఫైరింగ్‌కు దిగాయి. తమ పార్టీకి చెందిన అయిదుగురు కార్య‌క‌ర్త‌లు మృతిచెందిన‌ట్లు తృణ‌మూల్ కాంగ్రెస్ పేర్కొన్న‌ది. నాలుగో ద‌శ ఎన్నిక‌ల కోసం సుమారు 80 వేల మంది సీఏపీఎఫ్ ద‌ళాల‌ను మోహ‌రించారు. సుమారు 16000 పోలింగ్ బూత్‌లను ఆ ద‌ళాలు ప‌హారా కాస్తున్నాయి. కేవ‌లం కూచ్ బెహ‌ర్ జిల్లాలోనే అత్య‌ధికంగా 187 కంపెనీల సీఏపీఎఫ్ ద‌ళాల‌ను మోహ‌రించారు. నాలుగో ద‌శ‌లో మొత్తం 44 సీట్ల‌కు ఓటింగ్ జ‌రుగుతోంది.

కూచ్ బెహ‌ర్ జిల్లాలో జ‌రిగిన హింస‌లో ఓ మీడియా సంస్థ‌కు చెందిన వాహ‌నం కూడా ధ్వంస‌మైంది. సితాల్‌కుచి నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన కాల్పుల్లో త‌మ పార్టీకి చెందిన అయిదుగురు కార్య‌క‌ర్త‌లు మృతిచెందిన‌ట్లు రాజ్య‌స‌భ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ ఓ లేఖ‌లో ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు. బూత్ నెంబ‌ర్ 126ను బీజేపీ స్వాధీనం చేసుకున్న‌ద‌ని, దాన్ని అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించిన టీఎంసీ కార్య‌క‌ర్త‌ల‌పై సీఆర్‌పీఎఫ్ ద‌ళాలు ఫైరింగ్ చేసిన‌ట్లు ఎంపీ ఆరోపించారు. ఏఐటీసీ పార్టీకి చెందిన వ‌ర్క‌ర్లు ఆ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఎంపీ ఓబ్రెయిన్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *