కార్మిక హక్కుల నేత నవల్కర్‌ ఇక లేరు..

Spread the love

ముంబయి : కార్మిక హక్కుల సామాజిక కార్యకర్త, వామపక్ష నేత సుందర్‌ నవల్కర్‌ (99) మృతి చెందారు. తన జీవితమంతా వారి హక్కుల కోసం తీవ్రంగా పోరాడిన ఆమె శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కోవిడ్‌ నిబంధనలను దృష్ట్యా చాలా తక్కువ మంది సమక్షంలో ఆమె మేనల్లుడి కుటుంబసభ్యులు దహన సంస్కారాలు పూర్తి చేశారు.

నవల్కర్‌ పుట్టి, పెరిగిందంతా ముంబయిలోని దాదర్‌లోనే. ఆమె మధ్యతరగతికి చెందిన న్యాయవాదులు కుటుంబంలో జన్మించారు. ఆమె కుటుంబం హిందూ మహాసభతో సంబంధాలున్నప్పటికీ.. నవల్కర్‌ వామపక్ష భావజాలం పట్ల ఆకర్షితురాలయ్యారు. ఆమె స్వాతంత్య్ర ఉద్యమంలో కూడా పాల్గన్నారు.

సిపిఐలో చేరిన తర్వాత… రెవల్యూషనరీ సోషలిస్ట్‌కు మద్దతుదారుగా వ్యవహరించారు. తరువాత, నక్సల్‌ బరిలో జరిగిన తిరుగుబాటు నుండి ప్రేరణ పొందిన ఆమె మహారాష్ట్రలో కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్ట్కిస్ట్‌-లెనినిస్ట్‌) మొదటి యూనిట్‌ను ఏర్పాటు చేసి, తొలి కార్యదర్శిగా వ్యవహరించారు. ఆమెపై నక్సలైట్‌గా ముద్రవేయడంతో… ఏడేళ్లపాటు జైలులో కూడా ఉన్నారు. అనంతరం కార్మికుల హక్కుల పట్ల తీవ్రంగా కృషి చేశారు.

ముఖ్యంగా కాంట్రాక్ట్‌ కార్మికుల కోసం ఆమె పోరాడారు. ఎయిర్‌ ఇండియాలోని సఫాయి కార్మికుల కోసం ఆమె సుప్రీం మెట్లు కూడా ఎక్కారు. 1996లో ఎయిర్‌ ఇండియా వర్సెస్‌ యునైటెడ్‌ లేబర్‌ యూనియన్‌ కేసులో ఆమె విజయం సాధించారు. తీర్పు తర్వాత తారుమారు అయినప్పటికీ కాంట్రాక్టు కార్మికులకు ఈ తీర్పు కొంత కాలం దారి చూపిందనే చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *