పద్దెనిమిదేళ్లలోపు వారికి టీకా వేయొద్దు.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జనవరి 16నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కేంద్రప్రభుత్వం గురువారం సాయంత్రం నిబంధనావళిని జారీ చేసింది. 18 సంవత్సరాల వయసు దాటిన వారికి మాత్రమే టీకా వేయాలని, గర్భిణీ స్త్రీలకు కూడా టీకా వేయవద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
శనివారం నుంచి దేశవ్యాప్తంగా 3,006 స్థలాల్లో 3 లక్షలమంది ఆరోగ్య సిబ్బందికి కోవిడ్-19 వైరస్ నిరోధక టీకాలను వేయనున్నారు. ఈ సందర్భంగానే కేంద్రం ఎవరికి వ్యాక్సిన్ వేయకూడదు, ఎవరికి వేయవచ్చు అంటూ రాష్టాల ప్రభుత్వాలకు నిర్దిష్టంగా ఆదేశాలు పంపింది. ఆ ప్రకారమే 18 ఏళ్ల లోపు వారికి, గర్భిణులకు టీకాలు వేయవద్దని కేంద్రం ఆదేశించింది. అలాగే కేంద్రం అనుమతించిన రెండు వ్యాక్సిన్లను మార్చి మార్చి వేయడాన్ని అనుమతించవద్దని కేంద్రప్రభుత్వం సూచించింది.
తొలి డోసును ఏ వ్యాక్సిన్ అయితే వేస్తారో రెండో డోసుకు కూడా అదే వ్యాక్సిన్ వేయాలి తప్ప మరో వ్యాక్సిన్‌ని వేయకూడదని, తమకు రెండో వ్యాక్సిన్ కావాలని ప్రజలు డిమాండ్ చేయవద్దని కేంద్రం హెచ్చరించింది.కాగా దేశంలో ఇంతవరకు రెండు వ్యాక్సిన్‌కు మాత్రమే భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి మంజూరు చేసింది. ఒకటి సీరమ్ ఇన్స్టిట్యూట్ రూపొందించిన కోవిషీల్ట్. 2, భారత్ బయోటిక్ రూపొందించిన కోవాక్సిన్. ఈ రెండు వ్యాక్సిన్లను 28 రోజుల వ్యవధిలో రెండు డోసుల చొప్పున ప్రజలకు వేయాల్సి ఉంది.ఇప్పటికే వైరస్ బారిన పడిన ప్రజలు వ్యాక్సినేషన్ సమయంలో ప్రోటోకాల్‌ని కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని కేంద్రం సూచించింది.