15న దేశవ్యాప్తంగా గవర్నర్ నివాసాల ముందు నిరసనలు : కాంగ్రెస్

Spread the love

న్యూఢిల్లీ : కేంద్రం ప్రభుత్వ నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు జరుపుతున్న ఆందోళనకు మద్దతిస్తూ జనవరి 15న దేశవ్యాప్తంగా గవర్నర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ శనివారంనాడు నిర్ణయించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ, ప్రజల పట్ల తమకున్న బాధ్యతలను కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ప్రభుత్వం కొద్దిమంది క్యాపిటలిస్టులకు అమ్ముడుపోయిందని ఆరోపించారు. జనవరి 15న ‘కిసాన్ అధికార్ దివస్’ను కాంగ్రెస్ పార్టీ పాటించనుందని, జిల్లా ప్రధాన కార్యాలయాల్లో నిరసనలు, ప్రదర్శనలు నిర్వహిస్తామని చెప్పారు. ర్యాలీల వెంట ర్యాలీలు తీస్తామని, దేశవ్యాప్తంగా గవర్నర్ కార్యాలయాల వరకూ ప్రదర్శనలు నిర్వహిస్తామని, రైతుల వాణి వినిపించే సమయం ఆసన్నమైందని అన్నారు.

సాగు చట్టాల పేరుతో తెచ్చిన ‘నల్ల చట్టాలను’ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి బదులు సమావేశాల సాకుతో ఆటలాడుతోందని సూర్జేవాలా విమర్శించారు. 40 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారని, 60 మందికి పైగా రైతులు మృతి చెందారని, రైతు మరణాలపై ఒక్కసారి కూడా ప్రధాని సంతాపం తెలపలేదన్నారు. ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా రైతులు జరుపుతున్న పోరాటం ఇదని తెలిపారు. ‘స్పీక్ అప్ ఫర్ ఫార్మర్స్’ పేరుతో జనవరి 15న సోషల్ మీడియాలోనూ కాంగ్రెస్ ప్రచారం చేపడుతుందని చెప్పారు. దీనికి ముందు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జ్‌లు రైతుల ఆందోళనపై చర్చించేందుకు, కార్యాచరణ చేపట్టేందుకు వర్చువల్ సమావేశం నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *