రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..

Spread the love

దిల్లీ : డిసెంబరు నెలలో జీఎస్టీ (వస్తు సేవల పన్ను) వసూళ్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.. ఎన్నడూ లేనివిధంగా గత నెలలో రూ.1,15,174 కోట్లు వసూలయ్యాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత నెలవారీ వసూళ్లలో ఇదే అత్యధికం కావడం విశేషం. 2019, ఏప్రిల్‌లో వసూలైన రూ.1,13,866 కోట్లే ఇప్పటి వరకు అత్యధికంగా ఉండేవి. 2019, డిసెంబరుతో పోలిస్తే ఈసారి ఏకంగా 12శాతం పెరిగాయి. నవంబరులో రూ.1,04,963 కోట్లు వసూలైన విషయం తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం జీఎస్టీ వసూళ్లు వరుసగా మూడో నెల రూ.లక్ష కోట్లు దాటాయి. కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందనడానికి ఇది బలమైన సంకేతం అని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. అలాగే జీఎస్టీ వ్యవస్థలో ఉన్న లోపాల్ని సవరించడంతో అవకతవకలకు ఆస్కారం తగ్గిందని.. అది కూడా వసూళ్ల పెరుగుదలకు ఓ కారణమని వెల్లడించింది.

డిసెంబర్‌ నెల వసూళ్లలో సీజీఎస్టీ కింద రూ.21,365 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ.27,804 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.57,426 కోట్లు (దిగుమతులపై పన్ను ద్వారా రూ.27,050 కోట్లతో కలిపి) వసూలయ్యాయి. దీంతో పాటు సెస్‌ కింద మరో రూ.8,579 కోట్ల(రూ.971 కోట్ల దిగుమతి సుంకంతో కలిసి) మేర సమకూరినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. ఇక ఐజీఎస్టీ నుంచి 23,276 కోట్లను సీజీఎస్టీ, 17,681 కోట్లను ఎస్‌జీఎస్టీ కింద సర్దుబాటు చేసింది. అన్ని సర్దుబాట్ల తర్వాత డిసెంబరు నెలలో కేంద్రానికి రూ.44,641 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.45,485 కోట్ల ఆదాయం సమకూరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *