హోం మంత్రి అమిత్ షా నివాసంలో కేంద్ర మంత్రుల భేటీ..

Spread the love

న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు ముహూర్తం సమీపిస్తుండటంతో కేంద్ర మంత్రులు మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వేలు, వాణిజ్యం, పరిశ్రమలు, ఆహారం శాఖల మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. రైతు సంఘాల నేతలతో బుధవారం ప్రభుత్వం చర్చించబోతున్న నేపథ్యంలో కీలక మంత్రుల సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. నూతన వ్యవసాయ చట్టాలపై మరోసారి చర్చించాలని కేంద్ర ప్రభుత్వం కోరిన మీదట రైతు సంఘాలు అందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. డిసెంబరు 30న చర్చించేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి.

కనీస మద్దతు ధరతో సహా అన్ని అంశాలపైనా చర్చించేందుకు సిద్ధమేనని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను రైతు సంఘాలు కొన్ని షరతులతో శనివారం అంగీకరించాయి. అధిక కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇవ్వడం, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి విధివిధానాలను రూపొందించడం వంటి షరతులను విధిస్తూ, డిసెంబరు 29న చర్చించేందుకు అంగీకారం తెలిపాయి. అయితే ఈ చర్చలను డిసెంబరు 30న మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ షరతులతో కూడిన అంగీకారాన్ని 40 రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి తెలిపాయి. వీటిలో 32 సంఘాలు పంజాబ్‌కు చెందినవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *