కొత్తగా ఉద్యోగంలో చేరే వాళ్ళు ఈ విషయాలు తెలుసుకోండి..

Spread the love

ఎడ్యుకేషన్ పూర్తయిపోగానే ప్రతీ ఒక్కరూ ఉద్యోగ వేటలో పడతారు.. మనలో చాల మంది ఉద్యోగం రావాలంటే ఏమేం కావాలో తెలుసుకుంటారు కానీ, వచ్చిన తర్వాత ఎలా ఉండాలనే విషయాన్ని పక్కన పెడతారు. ఉద్యోగం రావడమొక్కటే చాలనుకుంటారు. ఈ కారణంగానే వచ్చిన ఉద్యోగాలు కూడా ఎక్కువ కాలం నిలబడట్లేదు. అంతే కాదు, పనిచేసే స్థలంలో ఎలా ఉండాలో తెలుసుకోక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఉద్యోగంలో చేరిన కొత్తలో తెలుసుకోవాల్సిన విషయాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

పనికి మీరు కొత్త కాబట్టి, అన్ని విషయాలు మీకు తెలియకపోవచ్చు. చదువులో మనం నేర్చుకున్నదానికి ప్రాక్టికల్ గా చేసే దానికి తేడా ఉంటుంది. మీకు తెలియని విషయాలని అడిగి తెలుసుకోండి.

కొత్తగా ఉద్యోగంలో చేరారు కాబట్టి కాస్త బెరుకు ఉంటుంది. ఎవరేది చెప్పినా యెస్ అని వాళ్ళతో ఏకీభవిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. కానీ మీకు నచ్చని పనులని వాళ్లకోసం చేస్తా అని చెప్పకండి. మొహమాటం లేకుండా నో చెప్పేయండి. నో చెప్పడం తొందరగా అలవాటు చేసుకోండి. లేదంటే మీ సీనియర్లు వాళ్ళ పనులని మీ మీద తోసేసి హాయిగా నిద్రపోతారు. ముఖ్య విషయం ఏమిటంటే, అప్పటి వరకూ చదువుతో జీవితం సాగించిన మీరు, ఉద్యోగంలోకి వచ్చాక కొత్త కొత్త మనుషులని చూడాల్సి వస్తుంది. ఎదుటి వాళ్ళ తీరు మొత్తం తెలియకుండా ఒక అంచనాకి రావద్దు. ఎందుకంటే వాస్తవ ప్రపంచం మీరనుకున్న బాగా ఉండదని గుర్తించండి.

మీరు మార్కెటింగ్ లో ఉన్నట్లయితే మాటకారితనం పెంపొందించుకోవాలి. అవతలి వాళ్ళ దగ్గరకి వెళ్ళి మీరే మాట్లాడాల్సి ఉంటుంది. ఓర్పు, సహనం మార్కెటింగ్ చేసే వారికి చాలా అవసరం. పనిచేసే చోట మీ సహోద్యోగులతో ప్రతీ విషయాన్ని, ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలని పంచుకోవద్దు. ఎవరెలాంటి వారనేది మీకు అప్పుడే తెలియదు కాబట్టి మీ గురించి అన్ని విషయాలని బయట పెట్టకండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *