సిరీస్ కోల్పోయినా టీమ్ ఇండియాకు మంచి అవకాశం..
హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా దీర్ఘ కాలంలో టీమ్ఇండియాకు కీలకమైన ఆటగాళ్లుగా అవతరిస్తారని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నాడు. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కోహ్లీసేన 13 పరుగులతో గెలుపొందిన సంగతి తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ముందు 303 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. అనంతరం ఆసీస్ 289 పరుగులకు ఆలౌటై ఓటమిపాలయ్యారు. ఈ నేపథ్యంలోనే గంగూలీ టీమ్ఇండియా ఆల్రౌండర్లను ప్రశంసించాడు.
‘సిరీస్ ఓడిపోయినా టీమ్ఇండియాకు మంచి విజయం దక్కింది. ఇది సుదీర్ఘ పర్యటన అయినందున ఈ విజయంతోనైనా పరిస్థితులు మారుతాయని ఆశిస్తున్నా. జడేజా, పాండ్య దీర్ఘ కాలంలో భారత జట్టుకు విలువైన ఆటగాళ్లుగా మారతారు’ అని దాదా మ్యాచ్ అనంతరం ట్వీట్ చేశాడు. ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియా తొలి రెండు వన్డేల్లో విజయం సాధించడంతో ఆ జట్టు 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. భారత్ మూడో వన్డేలో గట్టి పోటీనివ్వడంతో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌పై ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో కోహ్లీసేన టీ20 సిరీస్ గెలవడమే కాకుండా టెస్టు సిరీస్‌లోనూ మంచి ఫలితాలు సాధించాలని గంగూలీ ఆశిస్తున్నాడు.