ఎప్పుడూ గ్లామర్ పాత్రలు చేయడం బోర్ అంటున్న పాయల్
తొలి సినిమా ‘ఆర్ఎక్స్ 100’తోనే అటు ఇండస్ట్రీని, ఇటు ప్రేక్షకులను ఆకట్టుకుంది పాయల్ రాజ్పుత్. అందాల ఆరబోతతో పాటు హీరోతో ముద్దు సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించడంతో తర్వాత కూడా ఆమెకు అలాంటి పాత్రలే దక్కాయి.
అలాగని పాయల్ గ్లామర్ పాత్రలకే పరిమితమై పోవాలని అనుకోవడం లేదు. రవితేజ ‘డిస్కో రాజా’తో మాటలు రాని అమ్మాయిగా తన అభినయంతో మెప్పించింది. ఇటీవల ‘ఆహా’ యాప్ ద్వారా విడుదలైన ‘అనగనగా ఓ అతిథి’ సినిమాలో డీగ్లామరస్ పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా పాయల్ మాట్లాడుతూ.. ‘నాలోని నటనా సామర్థ్యాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలంటే డీ గ్లామర్ పాత్రలే ఉపయోగపడతాయి. అందుకే అలాంటి పాత్రలు అప్పుడప్పుడూ చేయాలని నిర్ణయించుకున్నా. అలాగని గ్లామర్ పాత్రలకు దూరం కాను. రెండూ బ్యాలెన్స్ చేసుకుంటేనే ఇండస్ట్రీలో నిలబడగలం’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె ‘5డబ్ల్యూస్’ సినిమాలో నటిస్తోంది.