ప్రపంచ 100 ఉత్తమ నగరాల్లో ఢిల్లీకి చోటు..
న్యూఢిల్లీ: కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీ ప్రజలకు చల్లటి కబురు. 2021వ సంవత్సరానికి ప్రపంచ ఉత్తమ నగరాల జాబితాలో ఢిల్లీకి 62వ స్థానం దక్కింది. ప్రపంచంలోని 100 ఉత్తమ నగరాల్లో ఇండియా నుంచి చోటుదక్కిన ఏకైక నగరం కూడా ఢిల్లీనే కావడం విశేషం. 2020లో 81వ స్థానంలో ఉన్న ఢిల్లీ ఈసారి గణనీయంగా తన స్థానాన్ని మెరుగుపరుచుకోవడం మరో విశేషం. వాంకోవర్‌లోని రెసోనాన్స్ కన్సల్టెన్సీ లిమిటెడ్ ఈ ర్యాంకులు ఇచ్చింది. మార్కెటింగ్, బ్రాండింగ్, టూరిజం, ట్రావెల్ రిపోర్ట్స్‌లో ఈ సంస్థకు మంచి పేరుంది.
కాగా, ప్రపంచ టాప్-100 నగరాల జాబితాలో చోటు దక్కించుకున్న వాటిలో సెయింట్ పీటర్స్ బర్గ్, ప్రాగ్యూ, టోరెంటో, వాషింగ్టన్ డీసీ, అబూ దబి నగరాలు కూడా ఉన్నాయి. పేరుప్రతిష్టలు, నగర నాణ్యత, ఇతర సూచీలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది.
కాగా, ప్రపంచ బెస్ట్ -100 నగరాల్లో ఢిల్లీకి చోటు దక్కడంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఢిల్లీ వాసులందరికీ ఇది చాలా చక్కటి వార్త. ఉత్తమ నగరంగా ఢిల్లీని తీర్చిదిద్దేందుకు ఇక్కడి ప్రజలు ఆరేళ్లుగా చేస్తున్న కఠోర పరిశ్రమకు దక్కిన గుర్తింపు ఇది. ఢిల్లీలో చోటుచేసుకుంటున్న గుణాత్మక మార్పులను ప్రపంచం గుర్తించింది’ అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.