కేవలం ఒక్క నిమిషంలోనే కరోనా నిర్థారణ..

Spread the love

సింగపూర్‌ : కేవలం ఒక్క నిమిషంలోనే శ్వాస ద్వారా కోవిడ్‌-19 ను నిర్థారించగల వినూత్న సాధనాన్ని సింగపూర్‌ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మద్యం తాగి వాహనాలను నడిపేవారిని గుర్తించడానికి ఉపయోగించే బ్రీత్‌ ఎనలైజర్‌ తరహాలో.. ఈ సాధనాన్ని నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ (ఎన్‌యూఎస్‌) రూపొందించారు. లాక్‌డౌన్‌ లను సడలిస్తున్న నేపథ్యంలో.. ప్రజలకు కరోనా టెస్టులను వేగవంతంగా చేయడానికి ఈ సాధనం ఎంతో ఉపకరిస్తుంది.

సాధనం ఎలా పనిచేస్తుందంటే..

ఈ సాధనంలో ఒకసారి వాడి పారేసే మౌత్‌పీస్‌ భాగం ఉంటుంది. దీనికి అత్యంత కచ్చితత్వంతో కూడిన శ్వాస శాంప్లర్‌ సంధానమై ఉంటుంది. వ్యక్తి వదిలిన శ్వాసను ఇది సేకరిస్తుంది. ఆ నమూనాను ఒక మాస్‌ స్పెక్ట్రోమీటర్‌లోకి పంపి, కొన్ని లెక్కలను సేకరిస్తుంది. ఆ తర్వాత ఒక మెషీన్‌ లెర్నింగ్‌ సాఫ్ట్‌వేర్‌.. సదరు శ్వాస నమూనాలోని వోలటైల్‌ ఆర్గానిక్‌ పదార్థాల (విఒసి) ని విశ్లేషిస్తుంది. తద్వారా కోవిడ్‌ ఉనికిని నిమిషం కంటే తక్కువ సమయంలోనే తెలుపుతుంది. విఒసి లు మానవ కణాల్లోని చాలా జీవ రసాయన చర్యల్లో ఉత్పత్తవుతుంటాయి. వివిధ రకాల వ్యాధుల కారణంగా ఈ పదార్థాల్లో నిర్ధిష్ట మార్పులు కలుగుతుంటాయి. శ్వాస నమూనాలతో వీటిని గుర్తించవచ్చు. కరోనా వంటి వ్యాధులకు సంబంధించిన ఆనవాళ్లను ఈ విఒసి ల పరిమాణాల ఆధారంగా నిర్థారించవచ్చని పరిశోధనలో పాల్గొన్న జియాజునాన్‌ తెలిపారు. ఈ తాజా సాధనాన్ని 180 మంది రోగులపై పరీక్షించినప్పుడు 90 శాతానికి పైగా కచ్చితత్వంతో ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *