సంజయ్‌ లెటర్‌తో కేసీఆర్‌కు రిలీఫ్‌

Spread the love

పోతిరెడ్డిపాడుపై కేసీఆర్‌కు అనుకోని ఆయుధమిచ్చిన బీజేపీ
ఇప్పటికిప్పుడు పైచేయి సాధించిన కమల దళం
భవిష్యత్‌లో దీనినే అడ్డుపెట్టుకోనున్న కేసీఆర్‌

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ కెపాసిటీని రెట్టింపు చేయడంతో పాటు శ్రీశైలం ఫోర్‌షోర్‌లో సంగమేశ్వరం వద్ద మూడు టీఎంసీల కెపాసిటీతో రాయలసీమ లిఫ్ట్‌ స్కీంను తలపెట్టి ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్‌రావును అడకత్తెరలో పడేశారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే కేసీఆర్‌కు దోస్తానా మొదలైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఇతర రాజకీయ పక్షాలతో అప్పటి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు జట్టు కట్టి కేసీఆర్‌ను గద్దె దింపడానికి చాలా ప్రయత్నాలే చేశాడు. చంద్రబాబును ఏపీలో రాజకీయంగా దెబ్బ తీయడానికి జగన్‌కు కేసీఆర్‌ అండగా నిలిచారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌ నేతృత్వంలో వైసీపీ 151 సీట్లతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. జగన్‌ ప్రమాణ స్వీకారం నుంచి కేసీఆర్‌తో మంచి అవగాహనే కొనసాగింది. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల విషయంలోనూ కేసీఆర్‌ ఏపీ సీఎం జగన్‌కు డైరెక్షన్‌ ఇవ్వజూశాడు. వృథాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి నీళ్లను మళ్లించి తెలంగాణ మీదుగా ఏపీకి అటునుంచి పెన్నా బేసిన్‌ దాటించి కావేరికి నీళ్లు ఇవ్వడం ద్వారా తమిళనాడు నీటి కష్టాలను మరీ ముఖ్యంగా చెన్నై తాగునీటి ఇక్కట్లను తీర్చాలని పెద్ద ప్రణాళికే వేసుకున్నాడు.
ఇద్దరు ముఖ్యంత్రులు నదలు అనుసంధానంపైనే మూడు, నాలుగు సార్లు భేటీలు వేశారు. అధికారులు, ఇంజనీర్ల మధ్య చర్చలు జరిగాయి. రెండు రాష్ట్రాల ఇంజనీర్లు రెండు సార్లు మీటింగ్‌ పెట్టి ఎక్కడి నుంచి గోదావరి నీటిని మళ్లిస్తే రెండు రాష్ట్రాలకు ఉపయోగమో అలైన్‌మెంట్లను కూడా సిద్ధం చేశారు. ఇంటర్‌ స్టేట్‌ ప్రాజెక్టు స్టార్ట్‌ అవడమే తరువాయి అన్నట్టుగా మాంచి ఊపు వచ్చింది. ఉన్నట్టుండి జగన్‌ ఎందుకో ఈ ప్రాజెక్టు నుంచి డ్రాప్‌ కావాలని డిసైడ్‌ అయ్యారు. అనుకున్నదే తడువుగా పోలవరం నుంచి గోదావరి నీటిని వైకుంఠపురం, నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌, సాగర్‌, అక్కడి నుంచి శ్రీశైలం రిజర్వాయర్‌కు తరలించాలని ఓ ప్రణాళిక కూడా రూపొందించారు. అసలు కృష్ణా నదిలో నీళ్లు వేయకుండానే గోదావరి నీళ్లను ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు తరలించేందుకు ఒక డీపీఆర్‌ కూడా సిద్ధం చేయించారు. ఇక టెండర్లు పిలవడమే తరువాయి అన్నట్టుగా ఏపీలో దీనిపై ప్రచారం సాగింది. 2019 డిసెంబర్‌ 26న ఈ ప్రాజెక్టుకు జగన్‌ పునాది రాయి వేయాల్సి ఉంది. కానీ ఎందుకో వద్దనుకున్నాడు.
శ్రీశైలంలో ఎంత గడ్డుకాలంలోనైనా 30 నుంచి 45 రోజులు వరద వస్తున్నట్టుగా ఫ్లడ్‌ డేటాను విశ్లేషిస్తే తేటతెల్లమవుతోంది. ఎప్పుడో ఒకసారి తప్ప ప్రతి రెండేళ్లకోసారి కృష్ణా నదిలో ఓ మోస్తారు నుంచి మంచి వరదలే రికార్డు అవుతున్నాయి. కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తును పెంచే ప్రయత్నాల్లో ఉంది. ఆ ప్రాజెక్టు ఎత్తు పెంచినా భారీ వరదలు వస్తే నీళ్లు నారాయణపూర్‌, జూరాలను దాటి శ్రీశైలానికి చేరక తప్పదు. తుంగభద్రలో వచ్చే వరద నీళ్లు శ్రీశైలానికే చేరుతాయి. రెండు వైపుల నుంచి మోస్తారుకు మించి వరదలు వచ్చినా ఆ నీటిని ఒడిసి పట్టి సీమకు తరలించే ప్రయత్నాలకు జగన్‌ పెట్టారు. అందుకే పోలవరం నుంచి సీమ వరకు నీటి మళ్లింపు ఎందుకులే అని లైట్‌ తీసుకున్నాడు. శ్రీశైలానికి వచ్చే కృష్ణామ్మను ఒడిసి పెట్టి ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు సీమకు తాగు, సాగునీరు ఇవ్వాలనే యోచనలో జగన్‌ ఉన్నాడు. పనిలో పని కావేరి గ్రాండ్‌ అనికట్‌కు కొన్ని నీళ్లు ఇచ్చి కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టు వ్యయంలో సగానికి పైగా వసూలు చేసే ఆలోచనా జగన్‌కు ఉన్నట్టుంది. అందుకే కేసీఆర్‌తో దోస్తీ వద్దనుకున్నాడు. తెలంగాణ భూభాగం నుంచి నీటిని తీసుకోవడం ఎప్పటికైనా ప్రమాదకరమనే నిర్ణయానికి వచ్చాడు. అందుకే తన దారి తాను చూసుకన్నాడు.
పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ కెపాసిటీని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచడంతో పాటు సంగమేశ్వరం వద్ద రాయలసీమ లిఫ్ట్‌ స్కీంను ఆరంభించి అక్కడి నుంచి ఇంకో 3 టీఎంసీల నీటిని సీమకు తరలించేందుకు ప్లాన్‌ వేశాడు. దాదాపు ఆరు నెలల పాటు ఇందుకు అవసరమైన ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ప్రభుత్వం నుంచి అడ్మినిస్ట్రేటివ్‌ సాంక్షన్‌ కూడా ఇచ్చారు. ఇదంతా కేసీఆర్‌కు తెలియకుండా జరిగింది కాదు. జగన్‌ ఏపీ అసెంబ్లీలోనే ఈ విషయాన్ని ప్రకటించారు. అప్పుడే తెలంగాణ ఇరిగేషన్‌ ఈఎన్సీ ఈ ప్రాజెక్టులపై కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ)కు కంప్లైంట్‌ చేశాడు. తెలంగాణ అభ్యంతరాలపై బోర్డు ఏపీకి లేఖ రాసినా ఆ రాష్ట్రం దాన్ని లైట్‌ తీసుకుంది. ఏపీనే కాదు కేఆర్‌ఎంబీని చాలా సందర్భాల్లో తెలంగాణ సైతం లైట్‌గానే తీసుకుంది. అందుకు కారణం బోర్డును ఏర్పాటు చేశారు కానీ దానికి వర్కింగ్‌ మ్యానువల్‌ అంటూ ఏమీ లేదు. జస్ట్‌ కమ్యూనికేటర్‌గా మాత్రమే కేఆర్‌ఎంబీ ఇప్పుడు పనిచేస్తోంది. రేపు కూడా కేఆర్‌ఎంబీకి ఇంతకుమించిన అధికారాలు దఖలు పరచడానికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. కాబట్టి కేఆర్‌ఎంబీ నుంచి ఉత్తర ప్రత్యుత్తరాలు తప్ప ఇంకేమీ ఆశించడానికి అవకాశం లేదు.
అలాంటి కేఆర్‌ఎంబీని పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం లిఫ్ట్‌ స్కీంలు ఆపాలంటూ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ లెటర్‌ రాశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ ఏపీ ప్రభుత్వం చేపడుతున్న కొత్త ప్రాజెక్టులతో తెలంగాణకు నష్టం వాటిల్లుతుందని లేఖ ద్వారా ఫిర్యాదు చేశాడు. సంజయ్‌ లేఖకు గజేంద్రసింగ్‌ ప్రత్యుత్తరం పంపారు. ఏపీ ప్రభుత్వ చర్యలను నిలువరించాలని బోర్డును ఆదేశించారు. తన నేతృత్వంలోని అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌ ఏర్పాటు చేయాలంటూ జలవనరుల శాఖను ఆదేశించారు. అంటే బాల్‌ రాష్ట్రం కోర్టు నుంచి కేంద్రం కోర్టులోకి వెళ్లింది. సంజయ్‌ లెటర్‌తో కేంద్ర మంత్రి స్పందించారు. తాత్కాలికంగా రాష్ట్ర బీజేపీకి కాస్తంత బూస్టింగ్‌ ఇచ్చే విషయమిది. కానీ దీర్ఘకాలికంగా ఈ చర్య కేసీఆర్‌కు పెద్ద రిలీఫ్‌ ఇస్తుంది. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కరలేదు. ఎలాంటి కోరలు, అధికార పరిధి లేని కేఆర్‌ఎంబీ కొత్త ప్రాజెక్టులు చేపట్టకుండా ఎలా కట్టడి చేస్తుందో కేంద్ర మంత్రికే తెలియాలి. ఆ ఆదేశాలేవో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖలో, సీడబ్ల్యూసీకో ఇచ్చి ఉంటే కాస్త కర్ర పెత్తనం లాగానన్న ఉండేది. కానీ కేంద్ర మంత్రి కేఆర్‌ఎంబీకి ఆదేశాలు ఇవ్వడంతోనే పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం లిఫ్టు అంశం సగం నీరుగారిపోయింది. రేపు కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించే అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌కు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరైనా ఎవరి వాదన వారు వినిపిస్తారు తప్ప ఒక పరిష్కారం మాత్రం దొరకదు. కేంద్రం కూడా దీనికి పరిష్కారం చూపలేదు. వెరసి పోతిరెడ్డిపాడు ఇష్యూను పరిష్కరించడంలో కేంద్రంలోని బీజేపీ విఫలం అయ్యింది అనే ఆయుధాన్ని పరోక్షంగా సంజయ్‌ సీఎం కేసీఆర్‌ చేతిలో పెట్టినట్టు అయ్యింది. ఈ విషయం రాష్ట్ర బీజేపీ నేతలకు బోధ పడటానికి ఇంకొంత టైం పడుతుంది. అప్పుడు చేయడానికి వాళ్ల చేతుల్లో కూడా ఏమీ ఉండదు.
జగన్‌ కొత్త ప్రాజెక్టులు చేపడుతున్న ప్రాంతం పూర్తిగా ఏపీ భూభాగంలోనే ఉంటుంది. అక్కడ కేంద్ర బలగాలను మోహరించి ప్రాజెక్టును ఆపుతారు అని ఎవరైనా అనుకుంటే అది అత్యాశే అవుతుంది. ఇక సుప్రీం కోర్టు, ట్రిబ్యునల్‌లో ఇది అంత త్వరగా తేలే అంశం కూడా కాదు. కేంద్రం జలవివాదాల పరిష్కారానికి తెస్తామన్న కొత్త ట్రిబ్యునల్‌కు సంబంధించిన బిల్లు ఇంక రాజ్యసభలో గట్టెక్కలేదు. ఆ బిల్లు రాజ్యసభను దాటి చట్టరూపం దాల్చడానికి పెద్దగా అడ్డంకులు కూడా ఏమీ లేదు. కానీ అది కాస్త ముందట పడేసరికి జగన్‌ తాను తలపెట్టిన పనులు సగానికిపైగా పూర్తి చేస్తాడు. ఒక్క పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచుకున్నా చాలు మిగతా కాలువల విస్తరణ పనులు యేడాదికి కొంతైనా చేసుకుంటూ పోవచ్చు. వాటిని ఎవ్వరూ అడ్డుకోలేరు. అంటే కేంద్ర మంత్రి రాసిన లెటర్‌తో కేసీఆర్‌కు చిన్న జర్క్‌ మాత్రమే ఇవ్వగలిగారు తప్ప ఏమీ చేయలేకపోయారు. పైపెచ్చు తన చేతికే ఓ కత్తిని అందించి తమపైనే యుద్ధానికి ఉసిగొల్పుకోవడం మినహా ఇందులో నుంచి బీజేపీ పెద్దగా బాముకునేది కూడా ఏమీ ఉండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *